విద్యార్థుల సంక్షేమానికి అందరూ సహకరించాలి
అహ్మదీపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ
గజ్వేల్, ఆగష్టు14 : విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. అహ్మదీపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోరట్స్ యూని ఫామ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదాసు శ్రీనివాస్ విద్యార్థులకు యూనిఫామ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను తన వంతుగా ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులను అభినందించారు.
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా బాగా చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుగుణకర్, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ఉపాధ్యాయులు మల్లేశం, శిల్ప, బీఆర్‌ఎస్ నేతలు రమేష్ గౌడ్, అహ్మద్, నిజామోద్దిన్, రాములు, కిష్టారెడ్డి, బాలయ్య, బుచ్చిరెడ్డి, యాదగిరి, రాజయ్య, నర్సింహారెడ్డి, కరుణాకర్, సోని, హేమలత, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






