పెబ్బేరు మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్
పెబ్బేరు, జూన్ 18: పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపాలిటీ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల అధ్యాపక బృందాన్ని, వారికి సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్న ప్రిన్సిపాల్ను ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ నరేశ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల అభివృద్ధికి మరిన్ని మౌలిక వసతులు అవసరమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాఠశాల అభివృద్ధికి సహకరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి ప్రమోదిని రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి, ఏఏపీసీ చైర్మన్ అక్కల జ్యోతి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






