విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్
పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని.. ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనలు చేశారు. మంచిగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.




