పంతులమ్మగా మారిన కలెక్టర్
విద్యార్థులకు పాఠాలు బోధించి ప్రతిభను పరీక్షించిన జిల్లా కలెక్టర్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కె. హరిత పాఠశాల తనిఖీ సందర్భంగా పంతులమ్మగా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థులతో మమేకమై పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను చాక్లెట్లు అందించి అభినందిస్తూ మరింత ఉత్సాహపరిచారు.ఆకస్మిక తనిఖీలో భాగంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.
తాగునీటి సౌకర్యం, తరగతుల నిర్వహణ, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని తొమ్మిదో ఎక్కం (9 టేబుల్) చెప్పమని అడగగా, ఆమె గడగడా చదివి వినిపించడంతో కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో బోధించాలని సూచించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.






