23 July, 2026 | 2:05 PM

నీట్ లీకేజీపై కాంగ్రెస్ ఆగ్రహం.. రాస్తారోకో, దిష్టిబొమ్మ దహనం

23-07-2026 01:00 PM

భిక్కనూర్, జూలై 23(విజయ క్రాంతి): నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనను నిరసిస్తూ భిక్కనూర్ మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం భారీ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు, విద్యార్థులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రతీకగా దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.