పాల్వంచ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్ పరిధిలోని
ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్వంచ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో లోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్ కుమార్, ఎస్త్స్రలు టి.నాగరాజు జీ.విజయ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.






