21 May, 2026 | 2:42 AM

డ్రైనేజీ సమస్యపై కమిషనర్ గిరీష్ ఆకస్మిక తనిఖీ

21-05-2026 12:14 AM

జడ్చర్ల మే 20: వర్షాభావ పరిస్థితుల్లో రాజీవ్ నగర్ కాలనీలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ బుధవారం 3వ వార్డు పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కాలనీలోని ప్రధాన డ్రైనేజీలు, అంతర్గత కాలువలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.

పలుచోట్ల డ్రైనేజీలో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి అంతరాయం కలుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైకి వస్తుండటాన్ని గమనించారు.ఈ సందర్భంగా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైనేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు, మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రజారోగ్యానికి విఘాతం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.స్థానికులతో మాట్లాడిన కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కమిషనర్ వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నరేష్, వార్డ్ ఆఫీసర్ కృష్ణయ్య, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కే . అనంత కిషన్, జహంగీర్ పాషా, మణెమ్మ పాల్గొన్నారు.