26 February, 2026 | 10:56 PM

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

26-02-2026 12:48 AM

ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

మిర్యాలగూడ (మాడుగులపల్లి) ఫిబ్రవరి 25: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడు తూ, డ్రైవర్కు కంటి చూపు సరిగా లేకపోతే అది ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుందన్నారు. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ఇది తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే చర్య అన్నారు.

ఈ ఉచిత నేత్ర పరీక్షల శిబిరానికి భారీ సంఖ్యలో ఆటో, లారీ, ట్రాక్టర్, ఇతర వాహనదారులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.

డ్రైవర్లు ప్రయాణానికి ముందు వాహనాల సాంకేతిక పరిస్థితిని తనిఖీ చేయాలని, అలసటతో లేదా నిద్రమత్తులో వాహనం నడపవద్దని సూచించారు.  రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు ద్వారా సీపీఆర్ పైన అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. అనంతరం రోడ్డు భద్రత కు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు,ఎస్బి సీఐ రాము,మిర్యాలగూడ రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్త్స్ర కృష్ణయ్య,డిటిఅర్బి రిటైర్ సీఐ అంజయ్య,ఇతర పోలీస్ అధికారులు, ఏంపిడిఓ, వంశీదర్, ఏంఆర్‌ఓ సరోజ పావని, మాడుగులపల్లి సర్పంచ్ ఆరూరి నరేష్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.