హిందూ సంప్రదాయంలో ఎస్టీలకు విడాకులు
హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): హిందూ సంప్రదాయాలను పాటిస్తూ అదే పద్ధతిలో వివాహం చేసుకునే గిరిజనులు హిందూ వివాహ చట్టం 1956 ప్రకారం విడాకులు పొందవచ్చని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలా విడాకులు పొందాలంటే హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగినట్లు ఆధారాలు కూడా ఉండాలని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఇటీవల తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన కడావత్ శ్రీకాంత్, అశ్విత పరస్పర అంగీకారంతో (మ్యూచువల్) విడాకులు తీసుకునేందుకు కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు.
హిందూ వివాహ చట్టం సెక్షన్ 2 (2) ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ పిటిషనర్, ప్రతివాదికి వర్తించదని పేర్కొంటూ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు స్వీకరించలేదు. సెక్షన్ 2 (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ద్వారా గుర్తిస్తే ఉన్న హిందూ వివాహ చట్టం షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్టీ)లకు వర్తించదని ఉండటంతో దాని ఆధారంగా దిగువ కోర్టు పిటిషన్ స్వీకరణకు నిరాకరించింది. దీంతో సదరు కక్షిదారులు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది టీ సృజన్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ లంబాడాలు హిందూ మీనా వర్గానికి చెందిన వారిని.. వారికి హిందూ వివాహ చట్టం వర్తించదంటే ఆ వర్గానికి చెందిన మహిళలు చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.
అది బహుభార్యత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. పిటిషనర్, ప్రతివాది హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు కాబట్టి వారికి హిందూ చట్టమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో పిటిషనర్, ప్రతివాది హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నామన్న వాదనను ఎవరూ వ్యతిరేకించడం లేదని, వారి వివాహ ఆహ్వాన పత్రిక, ఫొటోలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నందున ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టేస్తున్నామని హైకోర్టు ప్రకటించింది. చట్టప్రకారం పరస్పర అంగీకార విడాకుల పిటిషన్‌ను ట్రయల్ కోర్టు విచారించి తీర్పు ఇవ్వాలని సూచించింది.






