02-08-2025 12:18:31 AM
వరంగల్, ఆగస్టు 1 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో ఆమోదించకపోతే కేంద్ర మంత్రుల పర్యటనలు రాష్ట్రంలో అడ్డుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం బీసీ ఇంటలెక్చువల్ సమావేశం జరిగింది. 42 శాతం బీసీ బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీసీ మేధావులు రాసిన లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం హైదరాబాదులో ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు మూడు నెలలుగా ఢిల్లీలో మూలుగుతుందని, అలాగే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నిస్తే రాజభవన్‌పై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ లేకుండా, ఇది కూడా ఢిల్లీలోనే పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం డ్రామాలా డుతున్నదని విమర్శించారు.
వాటికి ఆమోదముద్ర వేయకుండా ఢిల్లీలో చేయాల్సిన ధర్నాను గల్లీలో చేస్తుండటం బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును యధావిధిగా పంపాలని, ఇష్టం లేకుంటే ముస్లిం రిజర్వేషన్లు ఉంచాలన్నా, తీసివేయాలన్నా కేంద్రానికి అధికారం ఉందని వారికి ఇష్టం లేకపోతే ముస్లిం రిజర్వేషన్ తొలగించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
ఈ నెల 8న బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న బీసీ గర్జన కరీంనగర్‌లో కాదు ఢిల్లీలో పెట్టాలని, బీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. సకలజనుల తరహాలో ఉద్యమించి ఆగస్టు రెండో వారంలో సడక్ బంద్ నిర్వహించే ఆలోచన చేస్తామని వెల్లడించారు. బీసీ యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెలమల్ల వెంకటేశ్వర్లు, పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగ ని మల్లేశ్వర్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నారాయణ పాల్గొన్నారు.