calender_icon.png 2 August, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు: పోలీసుల కస్టడీకి మరో ఇద్దరు

02-08-2025 09:03:08 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నేడు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కల్యాణి, ధనశ్రీ సంతోషిని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. చంచల్ గూడ జైలు(Chanchalguda Jail) నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ కోర్టు ఇద్దరిని 5 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో గోపాలపురం పోలీసులు ఇద్దరిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. సరోగసీ ముసుగులో శిశువుల విక్రయాలపై ఇద్దరి పాత్రపై పోలీసులు విచారించనున్నారు. శిశువుల కొనుగోళ్లపై గోపాలపురం పోలీసులు కల్యాణిని విచారించనున్నారు. కల్యాణి విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం మేనేజర్ గా పనిచేస్తోంది.

శిశువుల విక్రయ రాకెట్‌పై కొనసాగుతున్న విచారణకు సంబంధించి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Creation Fertility Center) యజమాని నమ్రత, ఆమె కుమారుడు పచ్చిపాల జయంత్ కృష్ణలను గోపాలపురం పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఐదు రోజుల కస్టడీకి మంజూరు చేసింది. ఈ రాకెట్ స్వభావం, ఆపరేషన్ స్థాయి, సరోగసీ నెపంతో మోసపోయిన జంటల సంఖ్య వంటి అంశాలపై వారిద్దరినీ విచారిస్తామని పోలీసులు తెలిపారు. జూలై 25న సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ‘ఇండియన్ స్పెర్మ్ టెక్’ అనే అనధికార కేంద్రంపై జరిగిన దాడి తర్వాత వెలుగులోకి వచ్చిన అక్రమ సహాయక పునరుత్పత్తి సేవలపై విస్తృత దర్యాప్తులో నమ్రత, ఆమె కుమారుడు కీలక నిందితులుగా ఉన్నారు.