యోగా అసోసియేషన్ వ్యతిరేక సమావేశానికి హాజరు కావొద్దు
తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.ఎన్.రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ యోగా అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేకుండా, అసోసియేషన్కు వ్యతిరేకంగా ఈనెల 10న ఎల్బీ స్టేడియం లోని ఒలంపిక్ భవన్ లో జాలా మనోహర్ నిర్వహిస్తున్న సమావేశానికి తెలంగాణలోని జిల్లా యోగా అసోసియేషన్ ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కావద్దని తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.ఎన్.రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి సూచించారు.
ఈ మేరకు ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ యోగా అసోసియేషన్కు జాలా మనోహర్కు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం జాలా మనోహర్ వుషు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారని, అలాంటప్పుడు యోగా అసోసియేషన్ వ్యవహారాల్లో ఆయనకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. తెలంగాణ యోగా అసోసియేషన్ పేరుతో లేదా దానికి సంబంధించిన అంశాలపై జాలా మనోహర్ నిర్వహిస్తున్న సమావేశాలకు జిల్లా స్థాయి యోగా అసోసియేషన్ల ప్రతినిధులు హాజరై గందరగోళానికి గురికావద్దని ఎస్.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి కోరారు. యోగా క్రీడాభివృద్ధి, క్రీడాకారుల ప్రయోజనాలు, జిల్లా అసోసియేషన్ల సమన్వయం కోసం అధికారికంగా గుర్తింపు పొందిన తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
అసోసియేషన్కు వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాలకు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అనధికారికంగా యోగ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. యోగా రంగానికి సంబంధించిన విషయాల్లో సభ్యులు ఎలాంటి అపోహలకు గురికావద్దని,
అధికారిక సమాచారం కోసం తెలంగాణ యోగా అసోసియేషన్ను సంప్రదించాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారిక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఎస్.ఎన్.రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి వెల్లడించారు. ఆ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా యోగా అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై యోగా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించాలని వారు కోరారు.






