24 May, 2026 | 3:24 AM

విల్లాల సిత్రాలు!

21-08-2024 05:59 AM
  1. చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అనుమతులు.. అక్రమంగా ఆరు 
  2. కూల్చివేతలు చేపట్టిన అధికారులు

రాజేంద్రనగర్, ఆగస్టు 20: నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గత సొసైటీ పాలకవర్గం మొత్తం 225 రో హౌస్ విల్లాలకు అనుమతులు తీసుకొని అదనంగా మరో ఆరు నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌సింగ్ ఆధ్వ ర్యంలో మంగళవారం ఉదయం నుంచి ఓ విల్లాను పూర్తిగా నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. 

చిత్రపురి అక్రమాల పుట్ట

జీవో నంబర్ 658 ప్రకారం చిత్రపురి కాలనీలో రో హౌస్ నిర్మాణాలే చేపట్టకూడదు. అయితే, గత పాలకవర్గం దొంగచాటున అనుమతులు పొందారు. జీ ప్లస్ వన్ అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా జీ ప్లస్ టూ, త్రీ నిర్మాణాలు చేపట్టారు. సినీ కార్మికులందరికీ న్యాయం జరగాలంటే రో హౌస్‌లను పూర్తిగా నేలమట్టం చేసి వాటి స్థానంలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తే మూడు వేల మందికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   

రివైజ్డ్ పర్మిషన్ తీసుకుంటాం

చిత్రపురి కాలనీలో రో హౌస్ విల్లాలు అదనంగా నిర్మించిన విషయంలో త్వరలో ఉన్నతాధికారుల నుంచి రివైజ్డ్ పర్మిషన్ తీసుకుంటామని చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయంలో గత పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సినీ కార్మికులందరికీ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.