25 August, 2026 | 1:26 AM

22ఏపై దుష్ప్రచారం నమ్మొద్దు

25-08-2026 12:27 AM
  1. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  2. అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు  
  3.    22ఏ దరఖాస్తులు- 98% రిజిస్ట్రేషన్లు పూర్తి 
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 22ఏ పేరిట ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతాన్ని సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

22ఏ పేరిట ఇంతవరకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, దీనిపై దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు. సోమవారం సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. లక్షలాది ఎకరాలు 22ఏలో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటం 22ఏ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేట్ వక్తులు ఆక్రమిస్తే నిషేధిత జాబితాలో పెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి పల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ, సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే గత ప్రభుత్వం ఆ భూములపై హక్కులు సృష్టించి ధారాదత్తం చేసిందని మండిపడ్డారు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేట్ భూమి అని, 173 పైవేట్ సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడితే దాన్ని 22ఏలో పెట్టకూడదా.? అని ప్రశ్నించారు. 

మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ గ్రామానికి ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడం వల్ల భూవివాదాలు తలెత్తాయని అన్నారు. మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నంబర్‌లో 2 ఎకరాలను భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదానం చేసిన రెండు ఎకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడడంతో మొత్తం 22 ఎకరాలను పీఓబీలో పెట్టడం జరిగిందన్నారు.

ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీఓలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం (అర్బన్ ల్యాండ్ సీలింగ్ -యూఎల్సీ) కి సంబంధించి కొద్దిరోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజలను భయపెట్టడం మా ప్రభుత్వ విధానం కాదు.. ప్రజలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ భూములను కాపాడటం తమ బాధ్యత అన్నారు.