10 June, 2026 | 2:49 AM

ఇసుక తోలకాలకు ఇబ్బందులు సృష్టించ వద్దు

10-06-2026 12:17 AM

సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

గుండాల, జూన్ 9 (విజయక్రాంతి): రాష్టంలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించిన తరువాత మండలంలో కొన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, వీటి నిర్మాణం కొరకు ఇసుకను తోలుకుంటే పోలీసు, ఫారెస్ట్, రెవిన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు ఆరోపించారు.

మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్న సంతోషంతో ఉన్న ఇంటిని తీసేసి ఇల్లు కట్టుకుందామంటే ఇసుక తోలుకోనీయకపోవడంతో ఇందిరమ్మ ఇల్లులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఈ లోపు వర్షాకాలం ప్రారంభమైందని, కొత్త ఇల్లు అర్ధాంతరంగా ఆగిపోవడంతో లబ్ధిదారులు ఈ వర్షాకాలంలో ఆరుబయట ఉండాల్సి వస్తుందని ఆయన వాపోయారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, ఈసం కృష్ణన్న, పెండకట్ల పెంటన్న, పాయం ఎల్లన్న, బానోతు లాలు, మోకాళ్ళ బుచ్చయ్య, అరెం సమ్మయ్య, దుగ్గి శేఖర్, ఈసం నరసయ్య, పాయం సారయ్య పాల్గొన్నారు.