జల్ జంగిల్ జమీన్..కుమ్రం భీం
- నీళ్ళు నిధులు నియామకాలు.. తెలంగాణ ఉద్యమం
- కుమ్రం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలి
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క
- అశ్వారావుపేటలో కుమ్రం భీమ్ విగ్రహావిష్కరణ
అశ్వారావుపేట, ఆగస్టు 9 (విజయ క్రాంతి): జల్, జంగిల్, జమీన్ అని ఆనాడు కొమరం భీం పోరాటం చేశారని, నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని పంచాయతీ రాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క,అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , కలెక్టర్ అంకిత్ తదితరులు హాజరయ్యారు. స్థానిక కూడలిలో ఏర్పాటు చేసిన గిరిజన వీరుడు, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆమే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీ జాతి ఔన్నత్యాన్ని, కీర్తిని, హక్కులను కాపాడేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొమరం భీమ్ అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.
మనది పోరాటాల చరిత్ర
అడవుల్లో తమ పూర్వీకులు జీవనం ప్రారంభించిన నాటి నుంచి ప్రకృతి వైపరీత్యాలు, అడవులు, జంతువులు, వర్షాలు, వరదలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాన్నారు. కాకతీయుల కాలంలో జరిగిన పోరాటాల నుంచి సమ్మక్కసారలమ్మ వంటి వీర వనితల పోరాటం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కొమరం భీమ్ చేసిన పోరాటం వరకు ఆదివాసీ సమాజం అనేక హక్కుల కోసం పోరాడిందని గుర్తుచేశారు. సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, భూమిఅడవిజలాలపై హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో అందలేదన్నారు.
రాజ్యాంగం హక్కులను అమలు చేయాలి
ఆదివాసీలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించిందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, భూహక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించారని చెప్పారు. అంబేద్కర్, నెహ్రూ వంటి నాయకులు ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను గుర్తించి రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఆరో షెడ్యూల్ వంటి రాజ్యాంగ పరమైన రక్షణలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆదివాసీ సమాజానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం.
ఆదివాసీల కోసం పోరాడిన గిరిజనేతర నాయకుడు అల్లూరి సీతారామరాజు కూడా మన్యం బిడ్డల హక్కుల కోసం పోరాటం చేశారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని,అడవి బిడ్డలు, పేదలు, బడుగు బలహీన వర్గాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. ఆధునికతతో పాటు తమ మూలాలను, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
భూమి, అడవి, జలాలపై హక్కులతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక గౌరవం వంటి అంశాల్లో ఆదివాసీ సమాజం మరింత అభివృద్ధి చెందేలా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






