ప్రార్థనా స్థలాల జోలికి వెళ్లొద్దు
* కోర్టులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వొద్దు
* సర్వేలన్నీ ఆపేయండి
* కొత్త పిటిషన్లు కూడా తీసుకోవద్దన్న సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఇప్పటికే అనేక కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి కేసులు వాదించకూడదని, కనీసం పిటిషన్లు కూడా తీసుకోవద్దని అన్ని దిగువ న్యాయస్థానాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, పీవీ సంజయ్ కుమార్, విశ్వనాథ్ లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కేవలం సుబ్రహ్మణ్యస్వామి ఒక్కరే కాకుండా వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వండి
దేశంలోనే ప్రార్థనా స్థలాల గురించి నమోదైన పిటిషన్లను విచారించిన సుప్రీం ఈ విషయంలో నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర వైఖరి ఏంటనే విషయంపైనే ఈ పిటిషన్ల భవితవ్యం ఆధారపడి ఉండనుంది.
మేము నిర్ణయం తీసుకోలేం..
ఈ అంశంపై కేంద్రం తన వైఖరి తెలియజేయాల్సి ఉన్నందున తాము ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రార్థనా స్థలాల్లో జరుగుతున్న సర్వేలను కూడా నిలిపేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల విషయంలో సర్వేల గురించి అనేక గొడవలు జరుగుతున్నాయి. ఆ స్థలం మాదంటే మాదని రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో ఓ మసీదు స్థలానికి సంబంధించి సర్వే జరుగుతున్న తరుణంలో గొడవ జరిగి అనేక ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటికే దేశంలో ఎన్నో ప్రార్థనా మందిరాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్త పిటిషన్లు వద్దే వద్దు
ఈ అంశానికి సంబంధించి కొత్త పిటిషన్లను అస్సలుకే తీసుకోవద్దని సుప్రీం కింది కోర్టులను ఆదేశించింది. అంతే కాకుండా ఈ కేసుల్లో ఎటువంటి తీర్పులు కానీ మధ్యంతర తీర్పులు కానీ ప్రస్తుతం ఇవ్వొద్దని సూచించింది. ఈ విషయాలు చాలా సున్నితంగా ఉంటున్న తరుణంలో వీటిపై స్పందించొద్దని కోర్టులకు సూచించింది.






