11 August, 2026 | 3:11 AM

అంబసత్రం సాగుదారులను గోసపెట్టొద్దు

11-08-2026 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

లక్ష్మీదేవిపల్లి మండలంలో సీపీఐ జనచైతన్య యాత్రకు అపూర్వ స్పందన

లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): దశాబ్దాలుగా భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న అంబసత్రం భూముల పేద రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా పాలకులు గోసపెట్టడం తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కౌన్సిల్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఐదో రోజైన సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలో సాగింది. సీతారాంపురం, లాలూ తండా, కోరుకొండ, హేమచంద్రాపురం తదితర గ్రామాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు, రైతులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల సెంటర్లలో జరిగిన బహిరంగ సభల్లో యాత్ర రథసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ మండల పరిధిలోని 264 సర్వే నంబర్లోని ఐదు వేల ఎకరాల అంబసత్రం భూములను గిరిజన, గిరిజనేతర పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్నప్పటికీ ఆ భూములపై చట్టబద్ధమైన హక్కులు లేవనే సాకుతో ప్రభుత్వం రైతు భరోసా నిలిపివేసిందని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాగుకు పెట్టుబడులు లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూ తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే సాగుదారులకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని, నిర్మితమవుతున్న సీతారామ ఎత్తిపోతల జలాలను లక్ష్మీదేవిపల్లి మండల రైతాంగానికి సాగునీరుగా పారించి భూములను సస్యశ్యామలం చేయాలని స్పష్టం చేశారు.

దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, కార్మిక చట్టాలను రద్దు చేసి శ్రమజీవుల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. టేకులపల్లిలో ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య యాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరి వెంకటేశ్వర్లు మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.