మా మిల్లులనే తనిఖీ చేస్తారా?
నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్ల కన్నెర్ర
నేడు తనిఖీలకు అధికారులు సమాయత్తం
అధికారుల వ్యూహానికి మిల్లర్ల ప్రతివ్యూహం
అవసరమైతే మిల్లులకు తాళాలువేసి కలెక్టర్‌కు ఇవ్వాలని నిర్ణయం?
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ధాన్యం మాయంపై అధికారులు సోదాలు ముమ్మరం చేయటంతో నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు రగిలిపోతున్నారు. తనిఖీలు చేస్తే అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లోనూ తనిఖీలను అడ్డుకోవాలని భావిస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా మాయమవుతున్న ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నదా లేదా? అనేది తేలుసుకొనేందుకు అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. సివిల్ సప్లు, విజిలెన్స్ అధికారులు వెళ్లినా నిజాలు బయటకు రాకపోవటంతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సారధ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మిల్లులను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది రహస్యంగా సివిల్‌సప్లు ఉన్నతాధికారుల కనుసన్నల్లో సిద్ధం చేసుకున్న ప్రణాళిక. ఈ విషయాన్ని ఎలాగో పసిగట్టిన మిల్లర్లు అందుకు కౌంటర్ చర్యలు మొదలుపెట్టారు. మిల్లర్ల సమావేశం పెట్టుకుని అధికారులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలను అడ్డుకునేలా ప్రతివ్యూహం పన్నినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మా మిల్లులనే తనిఖీ చేస్తారా? అని రగిలిపోతున్నట్టు సమాచారం. అవసరమైతే మిల్లులకు తాళాలు వేసి.. తాళం చెవులను జిల్లా కలెక్టర్‌కు అప్పగించేందుకు మిల్లర్లంతా సిద్ధంగా ఉండాలని వారి నేతలు హుకుం కూడా జారీచేసినట్టు తెలిసింది. ఈ పథకం వెనుక భారీగా ధాన్యాన్ని అమ్మేసుకున్న తిమింగలాలే ఉన్నట్టు మిల్లర్ల అసోసియేషన్‌లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
కిందివారితో లాభం లేదని..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మిల్లర్లకు గత ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని భారీగా కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు తనిఖీలకు వెళ్లడం.. ‘మామూలు’గా వచ్చేయడం పరిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం మిల్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో డీఎస్‌వో, డీఎంను సివిల్ సప్లు కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం ఎంత? ఎందుకు బియ్యాన్ని అప్పగించడం లేదు? అనే విషయం తెలుసుకొనేందుకు సివిల్‌సప్లు ఉన్నతాధికారులు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల నేతృత్వంలో తనిఖీ బృందాలను రహస్యంగానే సిద్ధం చేశారు.
దీనిని పసిగట్టిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్, వెల్ఫేర్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఏకమయ్యాయి. గతంలో ఎన్నడూ ఏకం కాని ఈ అసోసియేషన్లు సోమవారం రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. 10 శాతం నూకతో సన్న బియ్యం ఇవ్వడానికి మిల్లర్లు సుముఖంగా లేనందున.. తనిఖీల పేరుతో వేధించేందుకు తనిఖీ బృందాలు వస్తున్నాయి. కనుక దీనిపై చర్చించి కార్యాచరణ సిద్ధం చేయడానికి రావాలని మిల్లర్లందరికీ సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు.
తాళాలు పట్టుకుని సిద్ధంగా ఉండండి
ఎలాగైనా తనిఖీలను అడ్డుకోవాలని, లేకపోతే తాము స్వాహా చేసిన ధాన్యం వివరాలు బయటపడి కేసుల వరకు వెళ్తుందనే ఉద్దేశంతో ధాన్యాన్ని మాయం చేసిన పెద్ద మిల్లర్లు మిగతా అందరినీ రెచ్చగొడుతున్నట్టు తెలిసింది. తనిఖీలకు ఎవరూ సహకరించవద్దని సూచించినట్టు సమాచారం. అలాగే బోధన్ డివిజన్‌లోని మిల్లర్లందరూ మంగళవారం ఉదయం కలెక్టరేట్‌కు రావాలని కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అవసరమై తే మిల్లులకు తాళాలు వేసి.. తాళం చెవులను కలెక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమచారం. బయటకు మాత్రం 10 శాతం నూకతో సన్న బియ్యం ఇవ్వలేమని, అందుకే సమావేశం నిర్వహించుకున్నామని చెప్తున్నారు. ఇక సివిల్ సప్లు అధికారులు తనిఖీ చేస్తారా? లేక మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గుతారా? అనేది మంగళవారం తేలనుంది.






