29 July, 2026 | 12:50 AM

చర్చల పేరుతో కాలయాపన చేయొద్దు

29-07-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి 

ముషీరాబాద్, జూలై 28(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ చీఫ్ కన్వీనర్ సుల్తాన్ యాదగిరి, కన్వీనర్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి మాట్లాడారు.

రాష్ట్రంలోని 12 ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల కమిటీలతో కలిసి నూతన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. చీఫ్ కన్వీనర్ గా సుల్తాన్ యాదగిరి, కన్వీనర్ గా తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఓరుగంటి ఆనంద్ డాక్టర్ పాండుగౌడ్ కో కన్వీనర్లుగా అనిల్ కుమార్, జానకి రెడ్డి,  సోమయ్య, పద్మ, తోడేటి శంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారులకు మాత్రమే న్యాయం జరగాలని విజ్ఞప్తి చేశారు. 250 గజాల స్థలం, 25 వేల పెన్షన్ కోటి రూపాయల బీమా, స్మృతి వనం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు మాధవి, రవీందర్, ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు.