29 July, 2026 | 12:57 AM

పాఠశాలల్లో భాషా సామర్థ్యాలు పెంచాలి

29-07-2026 12:00 AM

జేసీ మధుసూదన్ నాయక్

భూత్పూర్/అడ్డాకుల/ముసాపేట, జూలై 28: ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలను మెరుగుపర చడానికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల వృత్తి అంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ప్రాథమిక స్థాయిలోనే పునాది బలంగా ఉండాలని, పాఠశాలల్లో ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఎఫ్.ఎల్.ఎన్తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (అడ్మిషన్లు) సంఖ్యను విరివిగా పెంచేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు.

పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రస్తుత విద్యా విధానానికి అనుగుణంగా ఇంకా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. జీవితంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికీ మరచిపోలేము. సమాజంలో ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ, విద్య నేర్పిన గురువులు కనిపించినప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా గౌరవిస్తారని జేసీ గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమాన్ని మండలంలో పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామని ఉపాధ్యాయులు, అధికారులు జాయింట్ కలెక్టర్కు హామీ ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాల బాలికలపై జిల్లా రిసోర్స్ పర్సన్ రవి కుమార్  చంచల శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉషారాణి, జిహెచ్‌ఎం ఆనందమ్మ, రిసోర్స్ పర్సన్లు రాఘవేందర్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, కనకమ్మలతో పాటు సీఆర్పీలు ఇక్రమ్, ఠాగూర్, నాగేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.