ఎస్‌ఐఆర్ గడువు ఆరు నెలలు పొడిగించాలి
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్,జూలై28 (విజయ క్రాంతి): ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని సవ్యంగా, పూర్తి స్థాయిలో నిర్వహించడానికి మరో 6 నెలల గడువు పొడిగించాలని మాజీమంత్రి, అసెంబ్లీలో బిఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్ మారేడ్ పల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 3 వ తేదీన ఈ కార్యక్రమం గడువు ముగుస్తున్నదని, ఇప్పటి వరకు 30, 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇంకా కేవలం 6 రోజుల వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం విధానం కూడా గందరగోళంగా, ఉందని, సిబ్బంది కూడా సరిపడా లేరని అన్నారు.ఫారం లను సక్రమంగా అందజేయడం లేదని, కొరత ఉందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే జిహెచ్‌ఎంసి కమిషనర్ కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. బిఎల్‌ఓ ల వద్ద సరిపడా ఫారం లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎమ్మెల్యే వివరించారు.






