calender_icon.png 5 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నా పట్టదా?

05-12-2025 01:16:55 AM

  1. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టాలి
  2. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్
  3. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమై వృద్ధులు అవస్థలు పడుతున్నారు.. పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.. అయినా ప్రభుత్వానికి పట్టదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో  అధికమైన వాయు కాలుష్యంపై గురువారం ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపాయి. మాస్కులు ధరించి ప్రధాని ప్రకటనలు చేయడం మాని.. చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వాయు కాలుష్యంపై పార్లమెంట్‌లో చర్చ జలరగాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రజలు ఊపిరి పిల్చుకోలేకపోతున్నారని, వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఏటా ఈ పరిస్థితి దారుణంగా ఉంటోందని మండిపడ్డారు.

ఇది రాజకీయ ం కాదని.. ప్రజా సమస్య అని దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వాయు కాలుష్యంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీలు కొందరు నోటీసులు జారీ చేశారు. వాయు కాలుష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సలహాలు ఇస్తోందని ఎంపీ మాణికం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.