calender_icon.png 5 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రపురి అక్రమార్కుల చిట్టా సిద్ధం

05-12-2025 01:19:05 AM

  1. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసు విచారణ పూర్తి 
  2. మొత్తం 15 మంది నిధులు కాజేసినట్టు ప్రభుత్వానికి నివేదిక 
  3. అవకతవకలపై విచారణ కమిటీని నియమించిన రేవంత్‌రెడ్డి సర్కార్ 
  4. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై విచారణ 
  5. బాధ్యుల నుంచి రికవరీ చేయాల్సిన మొత్తం రూ.43.78 కోట్లు 

సినిమా ప్రతినిధి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తయింది. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో వివిధ పదవీ బాధ్యతల్లో ఉన్నవారితోపాటు పలువురు సభ్యులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణ కమిటీ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వీరిలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉండటం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

తుది విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వానికి సమర్పించిన వివరాల్లో సొసైటీకి జరిగిన మొత్తం నష్టాన్ని రూ.43.78 కోట్లుగా గుర్తించారు. ఈ మొత్తాన్ని సంబంధిత బాధ్యులైన 15 మంది నుంచి వసూలు చేయాలని, అదనంగా 18 శాతం వడ్డీ కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కొమర వెంకటేశ్ (మాజీ అధ్యక్షుడు), అనిల్‌కుమార్ వల్లభనేని (మాజీ అధ్యక్షుడు), కృష్ణమోహన్ (మాజీ సెక్రటరీ), పరుచూరి వెంకటేశ్వరరావు (మాజీ ట్రెజరర్)లతోపాటు ఎంసీ మెంబర్లు తమ్మారెడ్డి భరద్వాజ, కే రాజేశ్వరరావు, దేవినేని బ్రహ్మానందరావు, చంద్ర మధు, కే ఉదయభాస్కర్, జే రామయ్య, కాదంబరి కిరణ్, వినోద్ బాల, ఏ మహానందరెడ్డి, రఘు బత్తుల, ప్రవీణ్‌కుమార్ యాదవ్‌ల పేర్లు ప్రభుత్వానికి అందిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. 

15 ఏళ్లుగా జరుగుతున్న అవకతవకలపై విచారణ 

సినీకార్మికులకు సొంత ఇంటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్స్ కేటాయించింది. ఈ ప్లాట్ల కేటాయింపులో పెద్దఎత్తున కుంభకోణం జరిగినట్టు గత ఏడాది ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అక్రమాల తంతుపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించారు. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీని నియమించారు.

దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కమిటీ ఈ వ్యవహారంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇటీవల గోల్కొండ కో సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ టీ రోజారాణి ప్రభుత్వానికి సమర్పించారు. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన 15 మందిని బాధ్యులను చేస్తూ తుది నివేదికను అందజేశారు.

ఈ 15 మందికి కూడా డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రత్యేకంగా నివేదిక కాపీలను పంపించినట్టు తెలుస్తోంది. బాధ్యుల నుంచి రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కమిటీలో కీలక పదవుల్లో ఉన్నప్పుడే వారు నిధులను కాజేసినట్లు, ప్లాట్ కేటాయింపుల్లో వివక్ష, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం కూడా జరిగినట్లు పేర్కొన్నారు.