దోషిగా తేలిన ట్రంప్
పోర్న్ స్టార్ కేసులో నేరం నిరూపణ
34 అంశాల్లో దోషిగా నిర్ధారించిన న్యూయార్క్ కోర్టు
జూలై 11న ట్రంప్‌కు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు
గరిష్టంగా నాలుగేళ్లు శిక్ష పడే అవకాశం
న్యూయార్క్, మే 31: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో అక్రమ సంబంధం కేసులో ఆయపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్టు న్యూయార్క్ కోర్టు తేల్చింది. 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఆలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయ ని గతంలో ఆరోపణలు వచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఈ విషయంపై మాట్లాడకుండా ఉండేందుకు ట్రంప్ పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని అప్పజెప్పారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారని అభియోగం ఉంది.
పోటీకి అర్హులేనా?
దోషిగా తేలడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని న్యాయనిపుణులు అంటున్నారు. నేరారోపణలు రుజువైతే పోటీ నుంచి తప్పుకోవా లన్న నిబంధం ఏదీ లేదని చెబుతున్నారు. జూలై 11న ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో గరిష్టంగా నాలుగేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది న్యాయమూర్తి విచక్షణాధికారం మీదే ఆధారపడి ఉంటుంది. జైలు శిక్ష విధించకపోతే జరిమానా విధించే అవకాశం ఉంది.






