26 July, 2026 | 6:42 AM

నిందితుడికి రాచమర్యాదలు

01-06-2024 02:29 AM

ఏకంగా ఐపీఎస్ అధికారి కుర్చీలోనే కూర్చోబెట్టారు

పోలీసులు, వైద్యులు, జువైనల్ బోర్డు సహకారం

పుణె పోర్షే కారు ప్రమాదంతో వ్యవస్థల్లో బయటపడ్డ లోపాలు..

పుణె (మహారాష్ట్ర), మే 31: పుణెలో సంపన్న కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలు డు చేసిన రోడ్డు ప్రమాదం వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది. పోలీసు లు, వైద్యులు ఇలా అన్ని రకాలుగా నిందితునికి సహకారం అందడం ఆశ్చర్యం కలిగిస్తోం ది. చివరికి మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల క్యారెక్టర్లపై నిందలు వేస్తూ బాధితులను భయపెట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న బాలుడిని 300 పదాల వ్యాసం రాయాలంటూ బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి ముఖం చాటేశారు.

ప్రతి వ్యవస్థ ఒకరిని కాపాడేందుకు ఇంతలా ప్రయత్నించాయి. మైనర్ బాలుడు రెండు పబ్‌ల్లో మిత్రులతో కలిసి రూ.69 వేలు ఖర్చు చేశాడు. అర్ధరాత్రి 2 గంటలకు తన పోర్షెలో బయల్దేరాడు. అదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అనీశ్, అశ్విని ఇంటికి వెళ్తున్నారు. వీరి బైక్‌ను 200 కి.మీ. వేగంతో వస్తున్న పోర్షె కారు ఢీకొట్టింది. దీంతో అనీశ్, అశ్విని ప్రాణాలు కోల్పోయారు. అదే మార్గంలో వెళుతున్న పలువురు కారులో ఉన్న వ్యక్తులను పట్టుకొని, ఎరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఏసీపీ కుర్చీలోనే మర్యాదలు..

విషయం తెలుసుకున్న అనీశ్ మావయ్య జ్ఞానేంద్రసింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అధికారుల తీరు చూసి ఆశ్చర్యపోయారు. బాధితులను పట్టించుకోకుండా అనీశ్, అశ్విని మధ్య సంబంధమేంటని కేసులో అనవసర విషయాలపై ప్రశ్నిస్తూ ఇబ్బంది పెట్టారని జ్ఞానేంద్ర వాపోయారు. అదే సమయంలో యాక్సిడెంట్ చేసిన కుర్రాడిని ఏసీపీ కుర్చీలో కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడం చూసిన కొందరు రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. పిజ్జాలను తెప్పించి నిందితులకు ఇచ్చారు. ఉదయం 3 గంటలకు ఓ ఎమ్మెల్యే పీఎస్‌కు వచ్చినా ప్రమాద తీవ్రత తెలిసి వెనుదిరిగారు. తర్వాతి రోజు అనీశ్ మిత్రుడు అఖిబ్ ముల్లా ఫిర్యాదు మేరకు సెక్షన్ 30 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  

తప్పించుకోవడానికి కొనుగోళ్లు..

యాక్సిడెంట్ చేసిన బాలుడ్ని కాపాడేందుకు పోలీసుల నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకు ప్రయత్నాలు జరిగాయి. అధికారులను నిందితుడి కుటుంబం కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆల్కహాల్ పరీక్షలను ఒక రోజు తర్వాత చేయడం అనుమానాలకు దారి తీసింది. డాక్టర్లను నిందితుడి తండ్రి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలు నిర్వహించిన సాసూన్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ అజేయ్ తావ్‌డేతో 14 సార్లు ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

డీల్ కుదరడంతో రూ.3 లక్షలు ఆస్పత్రి ప్యూన్‌కు చేర్చాడు. ఆయన ఆదేశాలతో రక్త నమూనాలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి మార్చేశారు. బాలుడికి బదులు మరో మహిళ నమూనాలు చేర్చారు. రూ.50 లక్షల డీల్ కుదిరినట్లు భావిస్తున్నారు. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి బాలుడి రక్త నమూనాలను మరోసారి సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపారు. నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి ధన్వాడే నిందితుడి విషయంలో ఉదారంగా వ్యవహరించారు. బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు, పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయాలని, 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయాలని నిబంధనలు విధించారు. కోర్టు తీర్పును వ్యతిరేకించిన అనేక మంది 20వ తేదీన ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. 

అధికారులపై చర్యలు..

ఎఫ్‌ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. రక్త నమూనాలు మార్చిన డాక్టర్ శ్రీహరిపై వేటు వేశారు. డాక్టర్ అజయ్ తావ్‌డే, ప్యూన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాలుడికి బెయిల్ ఇచ్చిన ధన్వాడేపై విచారణ మొదలైంది. ఈ విచారణ అనంతరం ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ధన్వాడే మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.