ఆర్‌ఎస్‌ఎస్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు
ఆర్‌ఎస్‌ఎస్ పట్ల
చాలామందిలో అపోహలు
మాకు ఎలాంటి
రాజకీయ అజెండా లేదు
హిందూ సమాజ శ్రేయస్సే లక్ష్యం
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కోల్‌కతా, డిసెంబర్ 21 : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను బీజేపీతో ముడిపెట్టొదని ఆ సంస్థ అధినేత చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆదివారం కోల్ కతాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి చాలామందిలో అపోహలు ఉన్నాయని అన్నారు. బీజేపీలో అనేకమంది నాయకులు ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వెళ్లినవాళ్లే అని, అంతమాత్రాన సంస్థను బీజేపీతో కలిపి చూడడం పొరపాటు అని ఆయన అభిప్రాయపడ్డారు.
సంఘ్ ఎవరి పట్ల విరోధ భావంతో పనిచేయదని, హిందూ సమాజ ఐక్యత కోసమే పనిచేస్తుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. చాలామందికి ఆర్‌ఎస్‌ఎస్ అనే పేరు మాత్రమే తెలుసని, కానీ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తుందో తెలియదని చెప్పారు. సంఘ్ అభివృద్ధి చెందడం కొందరికి నచ్చని విషయం అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి తమ అభిప్రాయం చెప్పే హక్కు దేశంలోని ప్రతి వ్యక్తి ఉందని, కానీ అది వాస్తవికత ఆధారంగా ఉండాలన్నారు. కేవలం హిందూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని భగవత్ ఉద్ఘాటించారు. సంఘ్ చేస్తున్న ఈ కృషితో భారత్ మళ్లీ విశ్వ గురువుగా మారుతుందని మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు.






