calender_icon.png 22 December, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల స్వయం సమృద్ధే లక్ష్యం

22-12-2025 02:04:52 AM

దేశీయ రైతులకు ఎరువుల కోత లేకుండా చేస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ

అస్సాంలోని నామరూప్‌లో భారీ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన

2030 నాటికి పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని ప్రధాని హామీ

గౌహతి, డిసెంబర్ 21: ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎరువుల కొరత లేకుండా చూడటమే ధ్యేయమని ఉద్ఘాటించారు. అస్సాం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన డిబ్రూగఢ్ జిల్లాలోని నామరూప్‌లో సుమారు రూ.10,601 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అమ్మోనియా- యూరియా ఎరువుల కర్మాగారానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అసోం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కర్మాగారం రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు.

కొత్త పరిశ్రమ ఈశాన్య భారత దేశపు పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చబోతోందని అంచనా వేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామగుండం, గోరఖ్‌పూర్, సింద్రీ వంటి చోట్ల మూతపడిన కర్మాగారాలను పునరుద్ధరించామని గుర్తుచేశారు. కొత్త పరిశ్రమ ద్వారా యేటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, ఇది కేవలం అసోంకే కాకుండా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల అవసరాలను కూడా తీరుస్తుందని వివరించారు. 2030 నాటికి పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి

‘పరీక్షలంటే భయం వద్దు.. ఒత్తిడిని దరిచేరనీయొద్దు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ యావత్ దేశ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలను భారంగా కాకుండా ఉత్సవంలా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అస్సాం రెండోరోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన బ్రహ్మపుత్ర జలాలపై ‘ఎంవీ చరైడియో 2’ షిప్‌లో ప్రయాణిస్తూ 25 మంది ఎంపిక చేసిన ప్రతిభావంతులైన విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ నిర్వహించారు.

ప్రధాని సుమారు 45 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే సవాళ్లు, మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలపై ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు మానసిక ప్రశాంతత ముఖ్యమని, ఏకాగ్రతతో సిద్ధమై అయితే ఎలాంటి కఠినమైన పరీక్షలైనా సులభంగా రాయవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. కేవలం మార్కుల కోసమే కాకుండా విజ్ఞాన సముపార్జన కోసమూ చదవాలని ఆదేశించారు.