శ్రవణ్‌కుమార్‌కు బెయిల్ ఇవ్వొద్దు
- జడ్జీల ఫోన్ల ట్యాపింగ్‌కు యత్నించారు
- హైకోర్టులో పీపీ వాదనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): 19 మంది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రయత్నాలు జరిగాయని, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లోని 19 మందిలో ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారని చెప్పారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని డేటాను ఎఫ్‌ఎస్‌ఎల్ విశ్లేషణ చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇలాంటి కేసులో పరారీలో ఉన్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరించడానికి శ్రవణ్‌కుమార్ సిద్ధంగా ఉన్నారని అతడి న్యాయవాది తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ కే సుజన శుక్రవారం ప్రకటించారు. గతేడాది పాస్‌పోర్ట్ అథారిటీ శ్రవణ్ పాస్‌పోర్ట్‌ను రద్దుచేసింది. శ్రవణ్ ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం వచ్చేలా చర్యలు చేపట్టారు. ట్రయల్ కోర్టు కూడా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో శ్రవణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విదేశాల్లో ఉన్నప్పటికీ, తనకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. విదేశాల్లో తన నివాస చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఇచ్చారన్నారు. వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.




