calender_icon.png 12 December, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేయొద్దు

08-12-2025 12:50:12 AM

-15 శాతం మందికి పుండ్ల ప్రమాదం

-సకాలంలో గుర్తించకపోతే కాళ్లు తొలగించాల్సిందే

-భారీ వాకథాన్‌లో వెంకయ్య నాయుడు

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 7 (విజయక్రాంతి): మన దేశం మధుమేహ రాజధానిగా మారిపోతోందని, బాధితులు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కాళ్ల సంరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉప రాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

మధుమేహుల్లో కాళ్ల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం నగరంలో భారీ వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల, సినీనటుడు సుశాంత్, కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మధుమేహం ఉన్నవారు కంటిచూపు తగ్గుతున్నా, కాళ్లపై పుండ్లు  కనిపించినా, చిన్న దెబ్బలు తగిలినా వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వల్లే చాలామంది కాళ్లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోకుండా రోజూ నడక, యోగా వంటి శారీరక వ్యాయామాలు చేయాలని సూచించారు.

85 శాతం ముప్పు..

కిమ్స్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు కీలక విషయాలు వెల్లడించారు. మధుమేహుల్లో 15- శాతం మందికి జీవితకాలంలో కాళ్లపై పుండ్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. నరాల బలహీనత వల్ల నొప్పి తెలియక చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితుల్లో 85 శాతం కేసులు కేవలం ఈ పుండ్లకు చికిత్స చేయకపోవడం వల్లే వస్తున్నాయని హెచ్చరించారు.

‘డాక్టర్ వూండ్’ యాప్ ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో ‘ద ఫుట్ డాక్టర్’ ఆసుపత్రి ఆధ్వర్యంలో రూపొందించిన ‘డాక్టర్ వూండ్’ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా గాయాలకు డ్రెస్సింగ్ చేసుకునే సదుపాయం కలుగుతుందని, వైద్యులు దూరం నుంచే పర్యవేక్షిస్తారని డాక్టర్ నరేంద్రనాథ్ మేడా వివరించారు. అలాగే, కాళ్ల సైజుకు తగ్గట్టుగా పాదరక్షలు తయారుచేసే ప్రత్యేక మిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మధుమే హ బాధితులు, వాకర్స్ పాల్గొన్నారు.