11-08-2025 01:02:25 AM
హైదరాబాద్, సిటీబ్యూరో అగస్టు 10 (విజయక్రాంతి): వర్షాకాలం ముగిసే వరకు రా జధాని నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వ యంతో, అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకొని 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు.
ఆదివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి జీహెఎంసీ, జలమండలి, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్, ఇరిగేషన్ విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరం, ఓఆర్‌ఆర్ పరిధిలో వర్షాకాల సన్నద్ధత, చేపడుతున్న చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణపై సుదీర్ఘంగా చర్చించారు.
తక్షణమే స్పందిస్తా
వర్షాకాలంలో అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థత చూపి, ఉమ్మడిగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వపరంగా ఎలాం టి జోక్యం అవసరమైనా తన దృష్టికి తీసుకు రావాలని తక్షణమే స్పందిస్తానని అధికారులకు మంత్రి భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో వివిధ శాఖల మధ్య లైజనింగ్ బాధ్యతను జీహెచ్‌ఎంసీయే తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొ నే ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన మాన్సూన్ పనులు, రోడ్ల మరమ్మతులు, క్యాపిట్‌ల నిర్మాణం వంటి అంశాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
శాశ్వత పరిష్కారానికి మాస్టర్ ప్లాన్
నగర ప్రజలను వేధిస్తున్న ట్రాఫిక్ జామ్, వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని మంత్రి పొన్నం వెల్లడించారు. అనంతరం జరిగిన పాత్రికేయు ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ ముందుచూపుతోనే నగరంలో ఎలాం టి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పొంగి ట్రాఫిక్ సమస్య లు వస్తున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత
వర్షపు నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి నీటిబొట్టు భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని, వినని వారిపై సామ, దాన, దండోపాయాలను ఉపయోగించి అయినా వర్షపు నీటి సంరక్షణ జరి గేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాటర్ మేనేజ్‌మెంట్‌పై జీహెఎంసీ, హైడ్రా, జలమండలి కలిసి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు
చెరువులు, నాలాల్లో నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి జీహెఎంసీ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.