15-11-2025 01:59:28 AM
జిన్నింగ్ మిల్లులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు ఆపొద్దని, సమస్యల పరిష్కారం కోసం రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తోందని, కేంద్రంతో పోరాడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పత్తి కొనుగోలుపై కేంద్రం పెట్టిన షరత్‌లకు నిరసనగా జిన్నింగ్ మిల్లులు ఈ నెల 17 నుంచి సమ్మె ను ప్రకటించడంతో మంత్రి శుక్రవారం స్పం దించారు.
మిల్లుల సమస్యలను సీసీఐ దృష్టి కి తీసుకెళ్లి, పరిష్కారం దిశగా ఒత్తిడి తెస్తామన్నారు. పత్తి కొనుగోలుపై ఎల్ 1, ఎల్ 2 నిబంధనతో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీసీఐ ఎండీ దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి మంత్రి సూచించారు.
చాలా జిల్లాల లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని, సీసీఐ మాత్రం ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని నిబంధనను ఎత్తివేసి, కనీసం 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్లు జిల్లావారీ వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు వెంటనే సేకరించి పంపేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరీని మంత్రి తుమ్మల ఆదేశించారు.