బ్లాక్ మెయిలర్లని నమ్మొద్దు
ప్రశ్నించే వైట్ కాలర్ వర్కర్‌ని ఎన్నుకోండి
సన్న వడ్లకే బోనస్ అంటూ కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హనుమకొండ, మే 22(విజయక్రాంతి)/వరంగల్ తూర్పు/ నర్సంపేట: పట్టభద్రులకు ప్రతినిధిగా ప్రశ్నించే వైట్ కాలర్ వర్కర్‌ని శాసనమండలికి పంపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. మీడియాను అడ్డుపెట్టుకొని అక్రమా లకు పాల్పడుతున్న వ్యక్తిని, అధికారం అండ చూసుకొని అక్రమాలు చేస్తున్న వ్యక్తులను నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారం సాధించుకున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేశ్‌రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తిచేశారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్ గార్డెన్, కరీమాబాద్, నర్సంపేటలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన వాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు కరెంట్ పోతే పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు అవసరమా అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యా, వైద్య వ్యవస్థలు అవస్థల పాలవుతున్నాయని విమర్శించారు.
వడ్లకు రూ.౫౦౦ బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. లోకసభ ఎన్నికలు ముగియగానే సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని కొర్రి పెడుతుందని మండిపడ్డారు. రైతు బంధు, రుణమాఫీల విషయంలో ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తుందే తప్ప డబ్బులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. గత పదేండ్లలో తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశ వ్యాప్తంగా తెలంగాణకు మించి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదో చూపించమంటే రాహుల్ గాంధీ, మోదీ నోరు మెదపడం లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఏ సంస్థ కూడా తెలంగాణలో పరిశ్రమలు నిర్మించడానికి ముందుకు రావడంలేదని ఆరోపించారు. కొత్తవి తీసుకురావడం పక్కన పెడితే ఉన్న వాటిని కాపాడే సామర్థ్యం వారికిలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నాడని ఆరోపించారు. సమాజంలో రాజకీయ చైతన్యం ఉన్న వారే విద్యావంతులని.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు కావాలా? చర్లపల్లి జైలుకు పోయి వచ్చిన బ్లాక్ మెయిలర్ కావాలా? అని అడిగారు.
తీన్మార్ మల్లన్న లాంటి వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న కేటీఆర్
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించి కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ మీదుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్.. ధర్మారం రైల్వేగేట్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై పడివున్న అంజయ్య (55)ని తన ఎస్కార్ట్ వాహనంలో ఎంజీఎంకి తరలించారు. రోడ్డు ప్రమాద బాధితుడి కోసం కేటీఆర్ స్వయంగా కారుదిగి వచ్చి స్పందించిన తీరుపట్ల స్థానికులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






