8 May, 2026 | 4:54 PM

జీతం వద్దు.. ఆ కుర్చీ వదలా!

26-04-2024 12:10 AM

l రెండేళ్లుగా జీతమే తీసుకోని అధికారిణి

l జీహెచ్‌ఎంసీ హెల్త్ సెక్షన్‌లో వింతలీలలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో రోజుకో వింత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ బర్త్, డెత్ సర్టీఫికెట్‌ల వ్యవహారం ఇంకా మర్చిపోక ముందే అదే సెక్షన్‌కు చెందిన ఓ అధికారిణి రెండేళ్లుగా జీతమే లేకుండా విధులు చేపడుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి బల్దియాకు బదిలీపై వచ్చిన సదరు అధికారిణికి మొత్తం సర్వీస్‌లో ఆమెకు ఒక్క ఇంక్రిమెంట్ కూడా పెరగలేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. బర్త్ అండ్ డెత్ సెక్షన్‌లో అంతా తానై చక్రం తిప్పుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. 

రెండేళ్ల క్రితం అస్టిస్టెంట్ స్టాటస్టికల్ అధికారిణి సబిత నల్లగొండ నుంచి బల్దియాకు బదిలీపై వచ్చారు. ఈ సమయంలో ఏ ఉద్యోగి అయినా.. తన సర్వీస్ రికార్డు (ఎస్సార్), లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ (ఎల్‌పిసి) తెచ్చుకుంటేనే బదిలీపై వచ్చిన చోట వేతనం డ్రా అవుతోంది. కానీ, ఈ అధికారిణి రెండేళ్లుగా ఎస్సార్, ఎల్‌పిసి తెచ్చు కోకుండానే విధుల్లో నిమగ్నం అయ్యారు. జీహెచ్‌ఎంసీలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తు న్నా.. ఇంత వరకూ ఐడి కార్డు కానీ, డిజిటల్ కీ కానీ పొందకపోవడం విశేషం. 

బర్త్ అండ్ డెత్ సర్టీఫికెట్ అక్రమాల్లో..

గ్రేటర్‌లో చోటు చేసుకుంటున్న జనన, మరణ నకిలీ ధ్రువీకరణ పత్రాల అక్రమాలపై సదరు అధికారిణి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే నకిలీ పత్రా లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నయంటూ ఆరోపణలు ఉన్నాయి. హెల్త్ సెక్షన్‌లో అంతా తా నై చక్రం తిప్పుతూ అక్రమార్కులను కాపాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఫలక్ నూమా సర్కిల్ పరిధిలో గుర్తించిన 43 బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్‌ల జారీలో సదరు నకిలీ సర్టిఫికెట్లను రికవరీ చేయాల్సిన బాధ్యతను కూడా మర్చి అక్రమార్కులకు ఊతమిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సెక్షన్‌లో తన పెత్తనమే నడిచేందుకు కంప్యూటర్ ఆపరేటర్లపై జులం ప్రదర్శిస్తూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. గడిచిన రెండేళ్ల కాలంలోనే పలువురు ఆపరేటర్ల నియామకాల్లో లక్షల రూపాయలు దండుకుంటున్న ట్టుగా సమాచారం. 

ఐడీకార్డు తీసుకోలేదు 

రెండేళ్లుగా నల్లగొండ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) సబిత ఐడి కార్డు, డిజిటల్ కీ తీసుకోలేదు. ఏడాది పాటు ఎస్సార్, ఎల్‌పిసీ తెచ్చుకోకుంటే రెండు మెమోలు ఇవ్వడం జరిగింది. రెండో మెమో జారీ తర్వాత ఎస్సార్, ఎల్‌పీసి తీసుకొచ్చినా నేటి వరకూ ఒక్క నెల జీతం కూడా ఆమెకు జీహెచ్‌ఎంసీ నుంచి విడుదల కాలేదు. మెమో జారీ చేయగానే నలుగురిని వెంటబెట్టుకుని మేయర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. 

 డాక్టర్ పద్మజ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్