12 April, 2026 | 7:44 PM

గుండెలయ రుగ్మతలకు క్యూ డాట్

12-11-2025 12:00 AM

కేర్ హాస్పిటల్స్‌లో 57 ఏళ్ల మహిళకు అధునాతన చికిత్స 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): దేశంలో ఆధునిక హృద య చికిత్సలో ముందంజలో ఉన్న బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ మరో మైలురాయి ని సాధించింది. తాజాగా ప్రారంభమైన క్యూ డాట్ టెక్నాలజీ సహాయంతో ఆట్రియల్ ఫైబ్రిలేషన్ అబ్లేషన్ (గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం సమస్యను సరిచేయడానికి చేసే చికిత్స) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అత్యాధునిక ఎలక్ట్రోఫిజియాలజీ పద్ధతిని ఉపయో గించిన దేశంలోని తొలి ఆసుపత్రులలో కేర్ హాస్పిటల్స్ ఒకటిగా నిలిచింది.

ఈ చికిత్సను 57 ఏళ్ల మహిళపై విజయవంతంగా నిర్వహించారు. ఆమెకు నిరంతర గుండె దడ (కర్ణిక దడ), బయాట్రియల్ కార్డియోమయోపతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో రీజినల్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో చికిత్స పొందు తూ, శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా స్థిరంగా ఉండి, గుండె లయ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది.

క్యూ డాట్ అనేది కాథెటర్ అబ్లేషన్ టెక్నాలజీలో తాజా పురోగతి. ఇది అధిక శక్తిని తక్కువ సమయంలో ఖచ్చితంగా, ఉష్ణోగ్రత నియంత్రణతో అందించే విధంగా రూపొందించబడింది. దీని వల్ల ఎలక్ట్రోఫిజియాలజీ నిపుణులు క్లిష్టమైన ఎట్రియల్ ఫైబ్రిలేషన్ చికిత్సలను తక్కువ సమయంలో పూర్తిచేయగలరు. అదే సమయంలో రోగి భద్రత మెరుగవుతుంది, అలాగే ఎక్కువ సేపు అనస్థీషియా లేదా రేడియేషన్కు గురికావడం వల్ల వచ్చే ఇబ్బందు లు తగ్గుతాయి.

ఈ విజయంపై కేర్ హాస్పిటల్స్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఎస్వీకే మాట్లాడుతూ.. క్యూ డాట్ సాంకేతికత అబ్లేషన్ చికిత్సలో మరింత ఖచ్చితత్వం, స్థిరత్వం తీసుకువస్తుందని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ సీఓఓ బిజు నాయర్ మాట్లాడుతూ, ఈ విజయవంతమైన శస్త్రచికిత్స కేర్ హాస్పిటల్స్ కార్డియాక్ ప్రోగ్రామ్ బలాన్ని, అలాగే మా నిపుణుల బృందం నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.