12 July, 2026 | 10:59 PM

బీజేపీలో రెట్టింపు ఉత్సాహం

10-06-2024 12:46 AM

తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు

పార్టీని నిలబెట్టిన కిషన్ రెడ్డి, బండికి గుర్తింపు

కమలం శ్రేణుల్లో హర్షాతిరేకాలు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కటంతో రాష్ట్ర బీజేపీలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు దక్కించుకుని, అప్పుడు కిషన్ రెడ్డి రూపంలో ఏకైక మంత్రి పదవిని సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయం సాధించి రెండు మంత్రిపదవులను సాధించింది. ఆదివారం కేంద్ర మంత్రిగా జీ కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

కేంద్రంలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే తెలంగాణకు ఊహించిన దానికంటే తక్కువగానే మంత్రి పదవులను ఇస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రాష్ట్రంలో పార్టీ ప్రారంభం నుంచి ముందుండి నడిపించిన కిషన్ రెడ్డిని మరోసారి కేబినెట్ అవకాశం వరించగా... దూకుడుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి పార్టీని ముందుకు తీసుకుపోయిన బండి సంజయ్‌కు తొలిసారిగా మోదీ సర్కారులో స్థానం దక్కింది.

కిషన్ రెడ్డి సౌమ్యునిగా పేరొందినా పార్టీని మాత్రం చక్కగా ముందుకు తీసుకుపోయారు. ఇక సంజయ్ తనదైన దూకుడుతో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కారును ఎండగట్టి గుర్తింపును పొందారు. పార్టీని నిలబెట్టిన ఇరువురు నేతలకు కేబినెట్ బెర్తులు దక్కడంతో పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా...

2028 అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే జరుగుతాయని... అప్పుడు బీజేపీ 8 నుంచి 88 స్థానాలకు చేరుకునడం పక్కా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఆయన ఏదో యధాలాపంగా చేసిన వ్యాఖ్య అయితే కాదిది. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో పార్టీకి కలిసివచ్చేలా బీజేపీ చక్రం తిప్పనుంది అనేది ఆయన భావనగా అర్థం చేసుకోవచ్చు. డీలిమిటేషన్ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా దాదాపుగా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. తమ ప్రత్యర్థి పార్టీల నేతలకు ఇబ్బంది కలిగేలా చేస్తూ తనకు ప్రయోజనంగా మార్చుకుంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అలాగే చేసిందనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ను వాడుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది కూడా బీజేపీ ఎత్తుగడగా తెలుస్తోంది. రెండు కేంద్ర మంత్రి పదవులను, కేంద్రంలో అధికారాన్ని ఈసారి సద్వినియోగం చేసుకుని తెలంగాణలో పార్టీని మరింతగా బలోపేతం చేయడంపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీయే సరైన ప్రత్యమ్నాయం అన్న దశ నుంచి ఒక్కసారిగా మూడో స్థానానికి పడిపోయేందుకు గల కారణాలను సైతం విశ్లేషించుకున్న పార్టీ.. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా దూసుకుపోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి నుంచి పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు గాను ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. 

క్రమంగా బలం పెంచుకుంటూ...

2014లో తెలంగాణ ఏర్పడిన సందర్భాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకుని ఏకంగా 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది. అప్పుడు రాష్ట్రం నుంచి వెళ్లిపోయేందుకు మార్గం సిద్ధం చేసుకున్న వైసీపీ, టీడీపీ కూడా ఒక్కో చోట విజయం సాధించాయి. ఇక తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించిన బీజేపీకి మాత్రం ఆ ఎన్నికల్లో ఒక్క సికింద్రాబాద్ తప్ప వేరే అవకాశమే దక్కలేదు. అయితే 2019 నాటికి ఆ పరిస్థితి మారిపోయింది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్‌లో బీజేపీ ఎంపీలు విజయబావుటా ఎగురవేశారు. అప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం లభించింది. ఇక ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. దీన్ని గుర్తించిన అధిష్ఠానం రెండు మంత్రి పదవులను రాష్ట్రానికి కేటాయించి పార్టీకి తగిన గుర్తింపును ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కటి నుంచి మొదలుపెట్టి 8 వరకు చేరుకున్నామని... భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పుడున్న తమ ఎంపీలు, కేంద్ర మం త్రులు మరింతగా కృషి చేస్తారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.