12 July, 2026 | 11:50 PM

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు

10-06-2024 12:44 AM

47.07 లక్షల టన్నులు సేకరణ

రూ.10,355.18 కోట్ల చెల్లింపులు

మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ.10,355.18 కోట్లు చెల్లించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. గతంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈ సంవత్సరం దాదాపు రెండు వారాల ముందే మార్చి 25వ తేదీ నుంచి కేంద్రాలు ప్రారంభించింది.

రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 7,148 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది. వీటిలో 6,345 కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగాయి. ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల టన్నుల ధాన్యం విక్రయం పూర్తయింది. మరో 10 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని పౌరసరఫరాలశాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు.  కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయడంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా తగ్గింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈసారి పౌరసరఫరాలశాఖ పక్కాగా ఏర్పాట్లు చేసింది.

అందుకు ఈదురుగాలులు, అకాల వర్షాలకూ రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు వెనకాడలేదు. ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.