1 July, 2026 | 5:28 PM

మనూకు పసిడి పతకం

02-06-2024 12:35 AM

తైపీ: భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనూ తైవాన్ ఓపెన్‌లో పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో విభాగంలో మనూ బరిసెను 81.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. చావో సున్ చెంగ్ (76.21 మీటర్లు), చావో హాంగ్ హువాంగ్ (71.24 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అయితే మనూ తన కెరీర్ బెస్ట్ (84.35 మీటర్లు) మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. గత నెల భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో మనూ జావెలిన్‌ను 82.06 మీటర్ల దూరం విసిరి రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. నిరుడు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలిచిన మనూ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. నీరజ్ చోప్రా, కిషోర్‌కుమార్ జెనాలు ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. మిగిలిన విభాగాల్లో మహిళల 400 మీటర్ల ఫైనల్లో వీకే విస్మయ 53.49 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం చేజెక్కించుకుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో నిత్యా రామ్‌రాజ్ (13.23 సెకన్లు) రెండో స్థానంలో నిలిచింది.