24 July, 2026 | 3:25 AM

ఎల్లమ్మ రథోత్సవం ఆలస్యంపై ఆలయం వద్ద డాక్టర్ కోట నీలిమ ధర్నా

24-07-2026 12:00 AM

నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు

తీసుకుంటామని హామీ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ 

సికింద్రాబాద్, జూలై 23 (విజయక్రాంతి): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి రథోత్సవాన్ని నిర్ణయించిన శుభ ముహూర్తానికి నిర్వహించకుండా ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఐదు గంటలపాటు ధర్నా నిర్వహించారు.

రథోత్సవం ఆలస్యానికి కారణమైన అధికారులతో పాటు బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ కేవలం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం రథోత్సవాన్ని నిర్ణయించిన శుభ ముహూర్తానికి ప్రారంభించకుండా వేలాది మంది భక్తులను వర్షంలో గంటల తరబడి నిరీక్షింపజేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

ఆలయ సంప్రదాయాలు, శాస్త్రోక్త విధానాలను పక్కనపెట్టి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలనే చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర కోణం కూడా ఉందని ఆమె ఆరోపించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు.

డాక్టర్ కోట నీలిమ చేపట్టిన ధర్నా విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ డాక్టర్ కోట నీలిమతో ఫోన్లో మాట్లాడి, జరిగిన ఘటనపై నాలుగు వారాల్లో సమగ్ర విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బోనాల ఉత్సవాలు ముగిసిన వెంటనే విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులు, ఇతరులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు.మంత్రి హామీ, అధికారుల భరోసా నేపథ్యంలో తాత్కాలికంగా ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించిన డాక్టర్ కోట నీలిమ, భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. హామీ మేరకు చర్యలు తీసుకోకపోతే మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.