31 July, 2026 | 12:49 AM

జానయ్యను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు

31-07-2026 12:00 AM

టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్

సూర్యాపేట, జూలై 30 (విజయక్రాంతి): టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,వజ్ర ఇండస్ట్రీస్ యజమాని వట్టె జానయ్య యాదవ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో టిఆర్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వజ్ర ఇండస్ట్రీస్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు.

సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు.జేపీ మిల్లుకు సంబంధించిన అంశంలో కూడా వాస్తవాలను పక్కనబెట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, బీసీ నాయకుడిగా ఎదుగుతున్న జానయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ ధాన్యం కుంభకోణాలపై దృష్టి పెట్టకుండా చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.

పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, కుంభకోణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీసీలు వ్యాపారాలు చేయకూడదా, రాజకీయాల్లో ఎదగకూడదా అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి రాజకీయంగా ఎదిగే హక్కు కల్పించిందన్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బీసీలను అణచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.

బీసీలపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణలోని బీసీ సమాజం తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జానయ్యకు టీఆర్పీ పార్టీ, బీసీ సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూర్ ఎస్ అధ్యక్షుడు బోల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.