16 May, 2026 | 2:38 AM

డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలి

16-05-2026 01:48 AM

ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌కు సర్పంచ్ వినతి

అశ్వాపురం మే 15 (విజయక్రాంతి):  మొండికుంట గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ సర్పంచ్ మర్రి సంధ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ శివారెడ్డి శుక్రవారం ఆర్‌అండ్బీ సూపరింటెండెంట్ను కలిసి మెమోరాండం అందజేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్డు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ పనులను గుత్తేదారు మధ్యలోనే నిలిపివేయడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో దోమలు, ఈగలు అధికమై ప్రజలు అనారోగ్య భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ గుత్తేదారు, సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.