చేపకు దూప!
- ఈసారి చేపల పెంపకానికి బ్రేక్ పడ్డట్లేనా?
నీళ్లు లేక ఎండిన చెరువులు, ప్రాజెక్టులు
మొదలు కాని చేప పిల్లల పంపిణీ ప్రక్రియ
ఆశల పల్లకీలో మత్స్యకారులు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 6 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, ప్రాజెక్టుల్లో చేపలు పెంచి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీకి ఈ ఏడాది నీటి గండం తప్పేలా లేదు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ, చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టిన దాఖలాలు కన్పించడం లేదు. గత నాలుగేండ్లుగా మే మాసంలోనే చేప పిల్లల పంపిణీ ప్రక్రియ పూర్తి కాగా ఈసారి జూన్ మాసం మొదటి వారం గడుస్తున్న ఇంకా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ షురూ కాలేదు.
ఇదిలా ఉండగా ఈసారి చేప పిల్లల పంపిణీకి నీటి గండం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది చెరువులు, ప్రాజెక్టుల్లో సంవృద్దిగా నీళ్లు ఉండగా ఈసారి చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టుల్లో సైతం చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. ఈ క్రమంలో చేప పిల్లల ప్రక్రియ ప్రభుత్వం మొదలు పెట్టినా ఎక్కడ వేస్తారనే ఆందోళన మత్య్సకారుల్లో నెలకొంది.
ఏడాదంతా ఉపాది, జీవనోపాధి లభిస్తుందని ఆశ పడ్డ మత్య్సకారులకు నిరాశే ఎదురయ్యే అవకాశాలు మిండుగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడం నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రాన్ని తాకాయని వాతావరణ శాఖ చెబుతున్నా.. ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు చినుకులు మాత్రమే పడ్డాయి. వర్షాలు కురిసి చెరువులు ప్రాజెక్టులోకి నీరు వస్తే తప్ప లేకుంటే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి బ్రేక్ పడ్డట్లేనని మత్య్సకారులు వాపోతున్నారు.
ఎండిన చెరువులు.. ప్రాజెక్టులు..
గతేడాది చివరి మాసాల్లో సరైన వర్షాలు కురియక పోవడంతో చెరువులు కుంటలన్నీ నీళ్లు లేక ఎండిపోయాయి. ఈ ఏడాది వేసవి కాలంలో ఎండతీవ్రత కూడా గరిష్టస్థాయికి చేరింది. దీంతో చెరువుల్లో నీళ్లన్ని ఎండిపోయి బీటలు వాడాయి. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో సైతం నీటి చుక్క లేకుండా పోయాయి. మేడిగడ్డ ప్రాజెక్టులో పియర్లు కుంగిపోవడం, అనేక సాంకేతిక సమస్యలతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేయడంతో ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురిస్తే తప్ప చెరువుల్లోకి, ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
చేపలపెంపకంతో తగ్గిన వలసలు...
ఉపాధి అవకాశాలు లేక అనేక మంది మత్య్సకారులు వలసలు వెళ్లిన సందర్బాలు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ, జలశయాల్లో చేపలపెంపకంతో వలసలు తగ్గిపోయాయి. అనేక గ్రామాల్లోని యువకులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ప్రతి ఏటా చెరువులు, జలశయాల్లో ప్రభుత్వం చేప పిల్లలను వదలడంతో ఏడాది తర్వాత వాటి పట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేప పిల్లల పంపిణీకి ఖరారు కానీ బడ్జెట్...
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి ఇంకా బడ్జెట్ ఖరారు కాలేదు. ఇప్పటికే జిల్లా మత్స్యశాఖ అధికారులు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించినా ఆ దిశగా ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే చేప పిల్లల పంపిణీకి రంగం సిద్దం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత మాసంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయి చేప పిల్లల పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది నీలి విప్లవానికి గండం తప్పేలా లేదు.






