16 July, 2026 | 9:50 AM

ఆర్నెల్ల పాలనలో కాంగ్రెస్ విఫలం

07-06-2024 01:24 AM

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఆర్నెల్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఆ పార్టీ 8 ఎంపీ సీట్లకే పరిమితమైందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు రెఫరెండమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తన లక్ష్యం చేరుకోవడంలో విఫలమయ్యారని, మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం తగ్గిందని తెలిపారు. బీజేపీ సాయం చేసింది బీఆర్‌ఎస్ కాదని చెప్పారు.

ఎన్నికల గణాంకాలు పరిశీలిస్తే కాషాయపార్టీకి రేవంత్‌తో పాటు మంత్రులు అవయవదానం చేశారని కౌంటర్ ఇచ్చారు. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని, సిద్దిపేటలో హరీశ్‌రావు ఓట్లు బదిలీ చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి సొంత జిల్లాతో పాటు గ్రామం కొండారెడ్డిపల్లిలోనూ బీజేపీకీ ఆధిక్యం వచ్చిందని, దీని బట్టి చూస్తే ఎవరు బదిలీ చేశారో అర్థమైంతుదన్నారు. బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని, బీఆర్‌ఎస్‌పై పిచ్చి ప్రేలాపలను మానుకోవాలని హితువు పలికారు.

అనంతరం దేవిప్రసాద్ ప్రసంగిస్తూ  తాము అధికారంలో ఉన్నప్పడు 2014లో 11 సీట్లు, 2019లో 9 సీట్లు గెలిచామని, కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పడు ఇంతకన్నా ఎక్కువ సీట్లు సాధించిందని గుర్తుచేశారు. ఇటీవల మహబూ బ్‌నగర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డిని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్ సన్మానించారు. విజయం సాధించిన తరువాత తొలిసారిగా తెలంగాణభవన్‌కు వచ్చి తనకు సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.