12-08-2025 08:09:14 AM
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలోని కేజీబీవీ పాఠశాల(KGBV School), కళాశాల సమస్యను పరిష్కరించి విద్యార్థినీలకు,సిబ్బందికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రీవెన్స్ డే లో సోమవారం కలెక్టరేట్ లోని డీఆర్డిఏ పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు,పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ లు మాట్లాడుతూ వర్షాలు వచ్చిన ప్రతిసారి విద్యార్థినీలు,సిబ్బంది మరియు తల్లిదండ్రులు మోకాళ్లలోతు వర్షపు నీటిని దాటుకుంటూ వెళ్లాలంటే భయాందోళనలకు గురవుతున్నారు.వర్షం వచ్చిన ప్రతిసారి విద్యాలయానికి సెలవు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప...శాశ్వత పరిష్కారం చూపడం లేదు.తక్షణమే స్థానిక ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించి విద్యార్థినీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.