calender_icon.png 12 August, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమయమైన వరంగల్ నగరం

12-08-2025 09:25:28 AM

హైదరాబాద్: ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం(Warangal city) జలమయం అయింది. బట్టల బజార్, పాతబీటుబజార్, రోడ్డుపై వరద నీరు నిలిచింది. హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, రామన్న పేట కాలనీలు, శివనగర్, కరీమాబాద్, సాకరాశికుంట, ఎన్ఎన్ నగర్, జలమయం అయ్యాయి. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో డీకే నగర్ లో గుడిసెవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనదారుడిని స్థానికులు కాపాడారు. రోడ్డుపై భారీగా నీరు  నిలవడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ 32వ డివిజన్ లో రామ్- లక్ష్మణ్ గార్డెన్ ప్రవారీగోడ కూలింది. ప్రవారీ గోడ కూలడంతో విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నర్సంపేట మండలం గురజాల వద్ద ముత్తడి పెద్దచెరువు పోస్తుంది. గురజాల శివారులో లోలెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుంది. గురజాల నుంచి వరంగల్, నర్సంపేట వెళ్లేందుకు రాకపోకలకు అంతరాయం కలిగింది.

భారీ వర్షాలకు(heavy rain) ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో షాపులు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్‌గా 92.9 మి.మీగా వర్షపాతం నమోదైంది.  అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ గా నమోదవ్వగా, ఖిలా వరంగల్ ప్రాంతంలో 148.5 మి.మీ, వర్ధన్నపేటలో 93.3 మి.మీ, పర్వతగిరిలో 107.5 మి.మీగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రి సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో సోమవారం రాత్రి తీవ్రమైన వర్షపాతం నమోదైందని, అనేక ప్రాంతాల్లో 150 మి.మీ నుండి 200 మి.మీ మధ్య వర్షపాతం నమోదైందని వాతావరణ ట్రాకర్లు తెలిపారు.

ఈ వర్షం ఉత్తర తెలంగాణలోని(North Telangana) కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లిలో రాబోయే రెండు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నల్గొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డిలలో ఇదే సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్‌లో తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం (LPA) కారణంగా ఈ తుఫాను కొనసాగుతోందని భావిస్తున్నారు. మొదట ఆగస్టు 14, 17 మధ్య తెలంగాణపై ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వేగంగా తీవ్రతరం అయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.