23 June, 2026 | 1:31 AM

తాగునీటి సమస్యలను పరిష్కరించాలి

23-06-2026 12:00 AM

జలమండలి కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన 

ఎల్బీనగర్, జూన్ 23 : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నెల రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, తక్కువ ప్రెజర్, కలుషిత నీరు తదితర సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు సోమవారం ఉదయం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (జలమండలి),హయత్నగర్, చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. 

సందర్భంగా సా మ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ ని యోజకవర్గంలోని ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటు న్నారన్నారు. హైదరాబాద్ నగరంలో రోజువారీ తాగునీటి డిమాండ్ సుమారు 800 ఎంజీడీ  ఉండగా, సరఫరా దాదాపు 600 ఎంజీడీ మాత్రమే ఉండడంతో అనేక ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా మారిందన్నారు. ప్రజలకు సరిపడా తాగునీరు అందక ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చే ముందు తగిన నీటి వనరుల ప్రణాళికను నిర్దారించాలన్నారు. మొట్టమొదటగా గోదావరి నీటిని ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేసి, ఆ తర్వాతే ఇతర ప్రాజెక్టులకు వినియోగించుకోవాలని డిమాండ్ చేసారు. ఎల్బీనగర్ ప్రాంతానికి ప్రతిరోజూ తాగునీటి సరఫరా అందించాలని లేని పక్షంలో సీజీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారి వద్ద ముసారాంబాగ్, గడ్డిఅన్నారం డివిజన్ల సరిహద్దు ప్రాంతంలో 400 ఎంఎం మంచినీటి పైప్లైన్ దెబ్బతిన్న కారణంగా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నూతన పైప్లైన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని, అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం విచారకరమన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే పైప్లైన్ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం సీజీఎం నాగేంద్ర కుమార్, జీఎం మహేందర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవ జీవన్ రెడ్డి , మొద్దు లచ్చి రెడ్డి , బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయకులు  చింతల సురేందర్ యాదవ్, సామ ప్రభాకర్ రెడ్డి, నీళ్ల అంజాన్ కుమార్ గౌడ్, గంగాని శ్రీనివాస్, ఉగాది ఎల్లప్ప, జయ ప్రకాశ్, ఎరుకల మల్లేశ్ గౌడ్ మంచి రాజేశ్,  శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.