పారిశ్రామిక పురోగతికి చేయూతనివ్వండి
- ‘భవ్య పేజ్ -1’లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలి
- ‘నేషనల్ డిజైన్ సెంటర్’ ఏర్పాటుకు మేం సిద్ధం
- మెగా లెదర్ పార్కులు మంజూరు చేయండి
- రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ
- పలు అంశాలపై వినతిపత్రం అందజేత
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా.. వికసిత్ భారత్‌ఏ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా తెలంగాణ ఇండస్ట్రియల్ ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలపై గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ. 8,500 కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.
భవ్య పథకం పేజ్--1లో భాగంగా రాష్ర్టంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. వీటికి జూన్ - జూలై 2026 దరఖాస్తు విండోలోనే అనుమతి ఇస్తే రాష్ర్టంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన కేంద్ర మంత్రి దష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఏరో --డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేయాల్సిన అవసరాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా వివరించారు.
హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. మెగా లెదర్, ఫుట్‌వేర్ అండ్ యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ (ఎంఎల్‌ఎఫ్ ఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించాలని కోరారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో రూ. 2,050 కోట్లతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్‌ఎల్‌ఎంఎల్) భాగస్వామ్యంతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ పథకం కింద నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పామ్ ఆయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్ సీఎల్)లో ఉత్పత్తి అయ్యే యూరి యా మొత్తాన్ని తెలంగాణకే కేటాయించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఎరువుల సరఫరాలో ఎదురైన అంత రాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.






