23 June, 2026 | 1:51 AM

వీబీజీ రామ్ జీ వరమా?.. భారమా?

23-06-2026 12:45 AM
  1. చట్టం అమలుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
  2. గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థలో మార్పులపై ఆందోళన
  3. పాలమూరు సహా పలు జిల్లాల్లో ఉపాధి భద్రతపై సందేహాలు
  4. మహిళల ఉపాధి అవకాశాలపై ప్రభావం

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : గ్రామీణ పేదల జీవనోపాధికి అండగా నిలిచిన ఉపాధి హామీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టం ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ, ఆర్థిక చర్చకు తెరలేపింది. ఇది గ్రామీణాభివృద్ధికి దోహదపడే సంస్కరణ అని కేంద్రం చెబుతుండగా, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపే చర్య గా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది.

ముఖ్యం గా పాలమూరు వంటి వలసల చరిత్ర ఉన్న జిల్లాలు, ఉపాధి హామీ పనులపై ఆధారపడిన మహిళలు, వ్యవసాయ కూలీల భవిష్యత్తుపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపనుందన్న ప్రశ్నలతో రాష్ట్రంలో చర్చ జోరందుకుంది. గ్రామీణ ఉపాధి నుంచి కేంద్ర, -రాష్ట్ర సంబంధాల వరకు విస్తరించిన ఈ వివాదం రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాగావీబీజీ రామ్ జీ చట్టం తెలంగాణలో చర్చనీయాంశంగా మారడానికి ప్రధాన కారణం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావమే.

రాష్ట్రంలోని లక్షలాది మంది వ్యవసాయ కూలీ లు, మహిళలు, గిరిజనులు, భూమిలేని పేద కుటుంబాలు ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా పాల మూరు, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ వంటి జిల్లా ల్లో ఉపాధి హామీ పనులు గ్రామీణ కుటుంబాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్నాయి. కొత్త చట్టం అమలుతో నిధుల కేటాయింపు, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, ఉపాధి హామీ స్వరూపంలో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రానికి అదనపు భారం పడుతుందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు, కేంద్రం మాత్రం గ్రామీణాభివృద్ధికి మరింత ఊతమివ్వడం, శాశ్వత ఆస్తుల సృష్టి, నీటి వనరుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపే లక్ష్యమని చెబుతోంది. దీంతో ఈ చట్టం నిజంగా గ్రామీణ పేదలకు ప్రయోజనం చేకూరుస్తుందా? లేక రాష్ట్రాలపై భారాన్ని పెంచుతుందా? అనే అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.  కేంద్ర -రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాల హక్కులు, గ్రామీణ ఓటర్లపై ప్రభావం చూపే రాజకీయ అంశంగా కూడా మారింది.  

పాలమూరుపై ప్రభావం.. 

తెలంగాణలో వీబీజీ రామ్ జీ చట్టం ప్రభా వం ఎక్కువగా కనిపించే జిల్లాల్లో పాలమూరు ప్రధానమైనది. ఒకప్పుడు కరవు, నిరుద్యోగం, వలస కూలీలకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం వేలాది పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామాల్లోనే ఉపాధి లభించడంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

అయితే కొత్త చట్టం అమలుతో ఉపాధి కల్పన విధానంలో మార్పులు వస్తే పాలమూరు ప్రాంతంపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గ్రామీణ కూలీలకు పనిదినాలు తగ్గినా, నిధుల విడుదలలో జాప్యం జరిగినా, స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో మళ్లీ వలసలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పాల మూరు ఎత్తిపోతల పథకం, సాగునీటి విస్తరణతో వ్యవసాయ రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో కొత్త చట్టం ఆ అభివృద్ధికి తోడ్పడుతుందా లేదా అన్నది అమలుపైనే ఆధారపడి ఉంది. అందుకే ‘కొత్త చట్టం గ్రామాల్లో ఉపాధిని పెంచుతుందా? లేక మరోసారి వలస బాట పట్టిస్తుందా?’ అనే ప్రశ్న పాలమూరు ప్రజల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ చట్టంపై తెలంగాణలో జరుగుతున్న చర్చల్లో గ్రామీణ మహిళల అంశం కీలకంగా మారింది.

వ్యవసా య పనులు లేని సమయంలో గ్రామాల్లోనే ఉపాధి లభించడం వల్ల వేలాది మహిళలు కుటుంబ ఆదాయానికి తోడ్పడుతున్నారు. కొత్త చట్టం అమలుతో పనుల స్వరూపం, పనిదినాలు, నిధుల విడుదల విధానంలో మార్పు లు వస్తే మహిళల ఉపాధిపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలకు అందుబాటులో ఉండే పనులు తగ్గితే వారి ఆర్థిక స్వావ లంబన దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటు న్నాయి.

కొత్త చట్టం విజయవంతం కావా లంటే మహిళలకు అందుబాటులో ఉండే పనులు, సకాలంలో వేతనాలు, స్థానిక స్థాయి లో ఉపాధి కల్పన వంటి అంశాలకు ప్రాధా న్యం ఇవ్వాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. కాగా వీబీజీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనను హక్కుగా గుర్తించిన వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నమే ఈ చట్టమని ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, కోట్లాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా మారిందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రధానంగా రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం అంశాన్ని ప్రస్తావిస్తోంది. 

ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు బాధ్యతలు మోపడం సమంజసం కాదని వాదిస్తోంది. కేంద్రం తన బాధ్యతలను రాష్ట్రాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈ అంశాన్ని రాష్ట్ర హక్కులు, గ్రామీణ పేదల ప్రయోజనాల కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోం ది.

అందుకే వీబీజీ రామ్ జీ చట్టాన్ని కేవలం పరిపాలనా సంస్కరణగా కాకుండా, గ్రామీణ ఉపాధి హక్కులపై ప్రభావం చూపే నిర్ణయంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. అయితే ఈ చట్టంపై వస్తున్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. ఇది గ్రామీణ పేదల ఉపాధిని తగ్గించే చట్టం కాదని, గ్రామీణాభివృద్ధికి మరింత వేగం తీసుకొచ్చే సంస్కరణ అని వాదిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్రం చెబుతోంది. 

కాగా వీబీజీ రామ్ జీ చట్టంపై  రాష్ట్ర ప్రభుత్వం పలు సందేహాలు లేవనెత్తుతున్న ది. ముఖ్యంగా గ్రామీణ కూలీలకు ప్రస్తుతం లభిస్తున్న ఉపాధి అవకాశాలు కొనసాగు తాయా!, మహిళల భాగస్వామ్యం తగ్గకుం డా కొత్త విధానంలో అవకాశాలు కల్పించగలరా? రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారం ఎంత మేర పడనుంది?, పాలమూరు వంటి వలసల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపాధి భద్రత ఉంటుందా?, చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల పనులకు మరింత ప్రాధాన్యం లభిస్తుందా?, ఉపాధి హామీ హక్కు స్వరూపంలో ఏమైనా మార్పులు వస్తాయా?, కేంద్రం ప్రకటిస్తున్న అభివృద్ధి లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయి, గ్రామీణ పేదల ఆదాయం పెరుగు తుందా? లేక ఉపాధి అవకాశాల్లో అనిశ్చితి పెరుగుతుందా? కేంద్ర మధ్య నిధు ల పంపిణీ, బాధ్యతల విషయంలో కొత్త వివాదాలు తలెత్తుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.