సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి యాబై లక్షల ప్రమాద బీమా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో సింగరేణి సంస్థ ఒప్పందం
కొత్తగూడెం, జూన్ 22 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్ పథకానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో, సోమవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో శాలరీ ఎకౌంటు కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు, రూ కోటి నుండి రూ కోటి యాబై లక్షల వరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది.
సింగరేణి యజమాన్యం ప్రత్యేక చొరవతో సహజ మరణానికి రూ 10 లక్షల నుండి రూ 20 లక్షల వరకు భీమా సదుపాయం కల్పించారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండి డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు, డైరెక్టర్ పర్సనల్ , ఫైనాన్స్ గౌతమ్ పోట్రు, ప్రత్యేక చొరవ ఫలితంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఈ కొత్త ఒప్పందం కుదిరింది . శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు మరికొన్ని రాయితీలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ,సింగరేణి సంస్థలో పని చేసే ఉద్యోగులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతాలు కలిగిఉండి, తమ ఖాతాలను శాలరీ ఎకౌంటుగా మార్చుకున్న వారికి ప్రమాద బీమా పథకంతో పాటు , మంచి రాయితీలు అమల్లోకి వస్తాయన్నారు. ఉద్యోగులందరూ చిరకాలం ఆయురారోగ్యాలతో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సుఖసంతోషాలతో ఉండాలి అనేదే కంపెనీ ఉద్దేశమన్నారు.,
అనుకోని ఘటనలు జరిగినప్పుడు కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలవడం కోసం, ఇటువంటి బీమా పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్,జి.వి.కిరణ్ కుమార్, జిఎం(పర్సనల్) ఐఆర్ & పిఎం, కవితా నాయుడు, జిఎం(పర్సనల్) ఈఈ & ఆర్సి ఏజేఎం మురళీధర్ రావు, జిఎం(ఎఫ్&ఏ) ఎన్.చక్రవర్తి, డిజిఎం(పర్సనల్) లు శ్రీ కేసా నారాయణ రావు, ముకుంద సత్యనారాయణ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజియన్ హెడ్ శ్రీ ఐ.రాజ్ కుమార్, చీఫ్ మేనేజర్ లు, అబ్దుల్ ఖాదర్ షేక్, బి.నరేందర్ రెడ్డి, కొత్తగూడెం బ్రాంచ్ హెడ్ జి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






