23 June, 2026 | 2:31 AM

హరీశ్.. ఆరడుగుల అబద్ధం!

23-06-2026 01:15 AM
  1. నీలాగా అగ్గిపెట్టె నటన మాకు రాదు
  2. పదేళ్లలో బీఆర్‌ఎస్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టింది?
  3. మంత్రి సీతక్క

నాగర్‌కర్నూల్, జూన్ 22 (విజయక్రాంతి): అబద్ధం ఆరడుగులు నిలబడి మాట్లాడితే ఎలా ఉంటుందో దానికి నిలువెత్తు సాక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ఉద్యమ పార్టీగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటో చెప్పాలని సవాల్ చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించి ఉద్యమ పార్టీ ముసుగులో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కూడు గూడు గుడ్డ నిరుపేదలకు అందించాలన్న ఇందిరా గాంధీ ఆశయం మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని పదేళ్లుగా కనీసం 80వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేక పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిందని గుర్తు చేశారు.

కనీసం రేషన్ కార్డులు కూడా మంజూరి చేయలేక పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రతి పేదవాడికి సన్న బియ్యం పంపిణీ చేసిందన్నారు. మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిందన్నారు.

నిరుపేద కుటుంబం నుండి నల్లమల ప్రాంతవాసిగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదారి పట్టించేలా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్లమల్ల ప్రాంతాన్ని కించపరిచేలా అహంకా రపూరితంగా ప్రసంగాలు చేయడం తగదని హెచ్చరించారు. 

కవిత ఆరోపణలపై స్పందించండి

ముందుగా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధినేత్రి కవిత నల్లికుట్లోడు అంటూ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని సీతక్క సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మెట్రో విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంటే బిజెపి బీఆర్‌ఎస్ తెరవెనక ఒకటిగా మారి కుట్రలకు పాల్పడు తుం దని ఆరోపించారు. రైతులకు అందించే ఎరువుల పంపిణీ విషయంలోనూ కేంద్రంతో చేతులు కలిపి బీఆర్‌ఎస్ కుట్రాలకు పాల్పడుతుందన్నారు.

దేశంలోని మరే రాష్ట్రంలో పండని పంటలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పండుతున్నాయని అయినప్పటికీ అత్యధిక స్థాయిలో పంట కొనుగోలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. 

వచ్చే ఎన్నికల్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఒక్క సీటు తగ్గిన మిగిలిన అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ చేశారు. వారితోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్‌రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి, స్పోక్‌పర్సన్ ఇందిరా, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు ఉన్నారు.